Friday, September 27, 2013

ఆరు సంవత్సరాల తర్వాత.............

       
                                 


  నా పేరు శృతి. నా గురించి చెప్పుటానికి ఎక్కువ ఏమి లేదు. గత సంవత్సరం నుంచి నా దినచర్యలో మార్పు లేకుండా నా జీవితం సాగిపోతుంది. ఆ దినచర్యలో భాగంగానే ఈ రోజు ఉదయం కూడా సముద్రం ఒడ్డున కూర్చొని ఉదయించే సూర్యుని చూస్తూ ఉన్నా. మానవాళికి వెలుగునివ్వాలనే గమ్యంతో సూర్యుడు సముద్ర గర్భాన్ని చీల్చుకొని బయటికి వస్తున్నాడు. తీరాన్ని తాకాలనే గమ్యంతో సముద్రం మధ్యలో పుట్టిన అల ఎగసిపడుతూ  ముందుకు సాగుతోంది. ఉదయాన్నే వచ్చి ఈ బీచ్ లో ఆరోగ్యం కోసం పరిగెడుతూ  ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో సాధించలనుకునే ఏదొక గమ్యం గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ నా జీవితం మాత్రం గమ్యం లేని గమనంతో ముందుకు సాగుతోంది. ఎందుకంటే నేనెవరో నాకే తెలీదు.

        ఇంతలో చర్చి బెల్స్ మోగటంతో తను రాస్తున్న డైరీ ఆపి, లేచి బీచ్ పక్కనే ఉన్న చర్చికి నడవసాగింది శృతి. దారిలో కనిపించిన సిస్టర్ మేరీ ని కృతజ్ఞతా భావంతో గుడ్ మార్నింగ్ అని పలకరించి చర్చిలోకి ప్రవేశించింది. పూర్తి ధ్యానంతో దేవుని ప్రార్ధించి , చర్చి పక్కనే ఉన్న తన అద్దె ఇంటికి చేరుకొని తన గదిలో కూర్చొని మరల డైరీ రాయటం మొదలుపెట్టింది శృతి.
        ఈ రోజుకి కచ్చితంగా రెండేళ్ల క్రితం సెయింట్ మేరీస్ హాస్పటల్ కి ఇద్దరు వ్యక్తులని ఒక యాక్సిడెంట్ నుంచి కొన ప్రాణాలతో తీసుకొచ్చారు. అందులో ఒకరు నేను.ఇంకొకరు నా భర్త. అతని పేరు నాకు ఇంకా గుర్తు రావట్లేదు. మా ఇద్దరిలో నా ప్రాణాలు నిలబెట్టగలిగారు కానీ నేను ఆరు నెలలు కోమా లో ఉన్నానంట.  నా భర్త ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. మా ఇద్దరినీ రక్తపు మడుగులో స్ట్రెచర్ పై హాస్పటల్ కి తీసుకువచ్చేపుడు నేను స్పృహలో లేనంట. కానీ నా భర్త, మమ్మల్ని స్ట్రెచర్ పై తీసుకువచ్చేపుడు , నా వైపు చూపిస్తూ "మా ఆవిడ. జాగ్రత్త " అని ఎంతో కష్టం మీద అన్నారంట.  ఆరు నెలల తర్వాత కళ్ళు తెరిచిన నాకు ఏమీ గుర్తులేదు. నా పేరు కూడా నేను చెప్పలేక పోయాను. మేమెవరో చెప్పగలిగే ఒక్క ఆధారం కూడా , పర్సు లాంటివి,  హాస్పిటల్ వాళ్ళకి లభించలేదంట. నా తలకి దెబ్బ తగలటం వల్ల అన్నీ మర్చిపోయా అని, మెల్లగా గుర్తొస్తాయని డాక్టర్ చెప్పారు కానీ రెండేళ్లయినా నా పేరు కూడా నాకు గుర్తు రాలేదు , అని రాయటం ఆపి , కన్నీరు తుడుచుకుని మరలా రాయటం మొదలుపెట్టింది.
        నేను కోమా లో ఉన్నప్పుడు , ఆ తర్వాత కూడా సిస్టర్ మేరీ నాకు బాగా కేర్ తీసుకున్నారు. నేను కోమా నుంచి బయటికి వచ్చాక అందరూ నా గతం నాకు గుర్తు చేయటానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఏ ట్రీట్మెంట్ కూడా నా గతాన్ని నాకు గుర్తు తేలేకపోయాయి. కొన్నాళ్ళ తర్వాత నన్ను కాపాడిన మిషనరీ వారికి భారం కాకూడదని నన్ను నేను పోషించుకునేందుకు సిస్టర్ మేరీ సాయంతో పక్కనే ఉన్న ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యే సమయంలో నా పేరు కూడా నాకు తెలీదు. కాబట్టి నా పేరు అనామిక అని  టైపు చేసి జాయినింగ్ ఆర్డరు నా ఎదురుగా పెట్టగా నేను అప్రయత్నంగా శృతి అని సంతకం చేశా.  నాతో పాటు అందరం షాక్ అయ్యాం. నాకు మాత్రం షాక్ తో పాటు కొంచెం సంతోషం కూడా కలిసింది. నా గతం గుర్తొచ్చింది అనిపించింది. కానీ రాలేదు. ఆ తరువాత డాక్టర్ అసలు విషయం చెప్పారు. మనం రోజు ఎక్కువగా చేసే పనులు అంటే తినటం మాట్లాడటం చదవటం వంటివి మన sub–conscious mind లో రికార్డు అయి ఎప్పటికీ అలానే ఉంటాయంట. అందువలనే నేను అప్రయత్నంగా శృతి అని సంతకం చేయగలిగా. నా గతం గుర్తు రాలేదు కానీ నా పేరు శృతి అని తెలిసింది ఆ రోజు. ఒక చిన్న సంతోషం. ఆ రోజు నుంచి టీచర్ గా కొత్త జీవితం మొదలయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు దినచర్యలో మార్పు లేకుండా నా జీవితం సాగుతోంది.
       ఒకరోజు అలానే ఫోన్ చేతిలో పట్టుకొని అప్రయత్నంగా ఒక నెంబరు డయలు చేశా. కానీ ఆ నెంబరు తాత్కాలికంగా పని చేయట్లేదని తెలసి నిస్రృహ కలిగింది. నాతో పాటు ఉన్న మిషనరీ వాళ్ళు కూడా నేనెవరో తెలుసుకోవటానికి వారికి తెలసిన పద్దతులతో దినపత్రిక లో ఫొటోలు ప్రచురించటం, పోస్టర్లు అతికించటం ద్వారా ప్రయత్నించారు కానీ అవేమీ సఫలమవలేదు. ఈ రోజుకి నా యాక్సిడెంట్ జరిగి రెండేళ్లవుతుంది. కానీ నేనెవరో నాకింకా తెలీదు. సిస్టర్ మేరీ సలహా తో నాలోని ఒంటరితనాన్ని తట్టుకోటానికి నాకు గుర్తున్న జీవితాన్ని ఈ రోజు ఇలా  డైరీ లో  పెడుతున్నా. గమ్యం లేని గమనం తో సాగిపోతున్న నా జీవితానికి ప్రతిబింబమే ఈ డైరీ.........అంటూ ఫుల్ స్టాప్ పెట్టి డైరీ మూసింది శృతి.
   ఆ రోజు కూడా తన జీవితం ఎప్పటిలానే గడిచింది.ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాఠాలు అటుపైన ఆటలు ఆడుతున్న బాల్యాన్ని చూస్తూ తనవైన ఆలోచనలలో మునిగిపోయింది. ఇంతలో తమ పైనుంచి విమానం ఎగురుకుంటూ వెళ్తుండటంతో పిల్లలు ఆట ఆపి దాన్నే చూస్తూ నుంచొనిపోయారు. వారిని చూసిన శృతి పెదాల మీద చిరునవ్వు విరసింది.తనకి తెలియని విషయం ఏమంటే తను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన జీవితం ఆ విమానంలోనే ఉందని. విమానాన్ని చూసి కేరింతలు కొడుతున్న ఆ పిల్లల అమాయకత్వం చూస్తూ, అదే విమానం నేలని తాకినంక తన జీవితమే మారిపోతుంది అని తెలియని అమాయకత్వంతో, చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది శృతి........

No comments:

Post a Comment