Wednesday, September 4, 2013

నేను , శ్రుతి , పరిమళ

                  
                                

           శృతి. ఆ పేరు లో తెలియని పరవశం. ప్రపంచం లో అంతకంటే అందమైన పేరు ఉండేదేమో. ఈ ఆలోచనలతో ముందుకు సాగుతుండగా మేము కలుసుకుందాం అనుకున్న పార్క్ రానే వచ్చింది. బండి దిగి తనకి సంక్షిప్త సందేశం          ( అదేనండి SMS) పంపారు. ఎక్కడున్నావు అని అడిగిన నాకు పది నిమిషాల లో నీ ఎదురుగా ఉంటా అనే సమాధానం వచ్చింది. సరే అనుకొంటూ ఆ ఉద్యానవనం లో ఒక బెంచీ చూసుకుని చల్లగా కూర్చొన్నా. నిజంగా జరిగిందో లేక నాకు అలా అనిపించిందో గానీ నా కుడివైపు నుండి గాలి రివ్వున దూసుకువచ్చి నన్ను తాకింది.  తల తిప్పి చూసా. కొంచెం దూరంగా తెల్లటి చుడీదార్ లో నుంచొని నా వైపే చూస్తోంది. ఆ గాలికి తనపై పడుతున్న కాగితపు పూల మధ్య భువినుంచి ఇలకు దిగివచ్చి నడచివస్తున్న దేవకన్యలా అనిపించింది. తను నాతో ఏదో చెప్తుంది అనిపిస్తుంది కానీ తనని చూసిన మైకంలో నాకు ఏమి వినిపించటం లేదు. ఒక అరక్షణం తర్వాత మళ్ళీ మాములయ్యాను. లేచి నుంచొని తన వైపు తిరిగా. తను " అంకుల్. కొంచెం బాల్ ఇవ్వండి" అని అంది. నేను కొంచెం అనుమానంతో కళ్ళు నలుపుకొని మళ్ళీ తన వైపు చూసా. అప్పుడు అర్థం అయింది తను శృతి కాదు అక్కడ ఆడుకుంటున్న పిల్లోడు అని. బాబోయ్ అనుకొంటూ చూట్టూ చూసా ఒక సారి.  అందరూ ఆమెలానే కనిపిస్తున్నారు.  తనని కలవటానికి నా మనసు ఇంత తపన పడుతోందా అనుకొంటూ  పక్కకి  వెళ్లి పల్లీ కొనుక్కుని తింటం మొదలుపెట్టా. నోట్లో పల్లీలు బుర్రలో ఆలోచనలు గట్టిగా నలుగుతున్నాయి. అందరూ తసలానే కనిపిస్తుంటే నిజమైన తను ఎదురుగా వచ్చినప్పుడు తనని గుర్తు పట్టేది ఎలా అని ఆరాటపడుతుండగా ఒక ఆలోచన వచ్చింది. అప్పటివరకు కళ్ళతో చూసిన నేను ఒక క్షణం కళ్ళుమూసుకుని గట్టి శ్వాస తీసుకొని మనసుతో చూసా.  కళ్ళు తెరచి ఎదురుగా చూడమంది. కొంచెం దూరంలో నా ఏంజెల్ హాయ్ అంటూ నా వైపు వచ్చింది. అలా తనని రెండో సారి కలిసా. ఆ పరిచయం మా ఇద్దరినీ మంచి స్నేహితులని చేసింది.
           ఆ రోజు మేము చాలా మాట్లాడుకున్నాం. కానీ నాకేమి పెద్దగా గుర్తులేదు. ఏంటి నమ్మట్లేదా? నిజమండీ బాబు. అసలే అందమైన అమ్మాయి. అందులోనూ నాకిష్టమైన అమ్మాయి. అలా పక్కనే కూర్చొని తన కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ  మాట్లాడుతుంటే ఇంకేం గుర్తుంటది చెప్పండి. నాకు గుర్తున్న కొన్ని విషయాలు చెప్తా వినండి. తను పుట్టింది, చదివింది హైదరాబాద్. ఉద్యోగం బెంగుళూరు. వారం క్రితం చెన్నై బదిలీ అయింది. ఆ విషయం నా ప్రెండ్ తో మాట్లాడేపుడు వాడు నేను చెన్నైలో ఉన్నా అని చెప్పాడంట. టెంకి పెళ్ళిలో నన్ను notice  చేసింది అంట. అందుకే కాల్ చేసి కలిసా అంది.  అలా మొదలయిన మా  పరిచయం కాలంతో పాటు స్నేహంగా మారింది.  కొన్నాళ్ళ తరువాత మేమిద్దరం తింటానికి ఒక రెస్టారెంట్లో కలిసాం. సరదాగా  మాట్లాడుతుంటే ఒకేసారి మెనూ కార్డు ముఖానికి అడ్డం పెట్టుకుంది. నవ్వుతూ  ఏమైంది అని అడిగా. "డోర్ దగ్గర బ్లూ డ్రెస్ లో ఉంది చూడు ఒక అమ్మాయి , తను నా రూంమేట్ . ఈ వారంలో మంచి ప్రెండ్స్ అయిపోయాం. ఇప్పుడు నన్ను నీతో చూస్తే నాతో ఆడుకుంటుంది" అంది. నేను నవ్వుతూ  ఆ అమ్మాయి మనవైపే వస్తోంది అన్నాను." అవునా . ఈ రోజు నాతో ఆదేసుకుంటుంది .  ఏదోటి సోది చెప్పాలి " అంది . తను వచ్చి శృతి పక్కన నంచుంది . శృతి ఒక వెకిలి నవ్వు వేసుకుని ఆ అమ్మాయి వైపు తిరిగి " ఏంటి పరీ ఇలా వచ్చావు " అంది . ఆ అమ్మాయి నవ్వుతూ " రెస్టారెంట్ కి సినిమా చూడటానికీ వస్తారా. ఆకలేస్తే తింటానికి వచ్చా" అంటూ నా వైపు తిరిగి " ఏరా సాగర్ నీకు ఇదెక్కడ దొరికిందిరా" అంది. శృతికి షాక్. " నీకు పరిమళ తెలుసా" అని అడిగింది. " అది అంత మర్యాదగా ఏరా అంటే తెలిసేవుంటుంది కదా శృతి " అన్నాను. 


     పరిమళ  నేను నవ్వుతూ  శృతి కి విషయం చెప్పాం. మేమిద్దరం కలిసి చదువు కున్నాం. మంచి ఫ్రెండ్స్. ఇలా ముగ్గురం మంచి స్నేహితులు అయిపోయాం. బాగా కలిసి పోయాం. రోజు ఫోన్ లో మాటలు, వారాంతంలో సినిమాలు, షాపింగ్ ఇలా సంతోషం గా గడచిపోతున్నాయి. నాకు శృతి కి మధ్య  చనువు బాగా  పెరిగింది. ఇలా రోజులు గడుస్తుండగా పరిమళ పుట్టినరోజు వచ్చింది ........

2 comments: