Saturday, August 31, 2013

అనగనగా ఒక మహానగరం

                         

  అనగనగా ఒక మహానగరం. అదే చెన్నై నగరం. ఉదయాన్నే పక్షుల రాగాలతో సూర్యోదయం. సాయంత్రానికి జనాల హోరులో సూర్యాస్తమయం. పేద్ద పెద్ద రోడ్లు, ఎత్తైన భవనాలు , అయినా అవన్నీ సరిపోనంత జనాలు. అప్పుడప్పుడు వచ్చే బస్సులు, ఎప్పుడూ అక్కడే ఉండే ఆటోలు. అందమైన ఆకాశం, ఎల్లప్పుడూ ఉండే సూర్యుని ప్రతాపం. జీవనోపాధి కోసం  జనాల ఉరుకలు పరుగులు , వాటితో వికసించే ఎన్నో ఆశల జాబితాలు.
ఎప్పుడూ మోగే గుడిగంటలు , అపుడపుడూ వినిపించే church bells. అందమైన సముద్ర తీరం. అలుపెరుగని నీటి కెరటం.
   ఈ మహానగరం లో ఎన్ని జరిగినా తన పని తాను చేసుకుపోయే ఆ సముద్ర కెరటం వలె ఆ రోజు నా మనసు కూడా చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంతగా నా శృతి ఆలోచనలతో నిండిపోయింది.  తనని మొదటి సారి కలవటానికి వెలుతున్న నాకు, చెన్నై నగరం అప్పుడే సాన పెట్టిన ముత్యంలా మునుపెన్నడూ లేనంత మధురంగా అనిపిస్తోంది. మనసు అందంగా ఉంటే అన్నీ అందంగా కనిపిస్తాయి అని పెద్దలు అంటారు. ఈ  ప్రేమ నా మనసులో ఉన్న అందాన్ని ఈ రోజు నాకు చూపించింది. అదే ప్రేమ నాలోని రాక్షసుడిని కూడా బయటికి తీస్తుందని ఊహించలేదు. ఒక స్నేహితుడు , ఒక ప్రియురాలు, నేను. మా ముగ్గురు జీవితంలో జరిగిన ఈ నాటకానికి ఈ రోజు సాగర్ శృతి కలయకతో తెరలేచింది. ఇవన్నీ ఊహించలేని అమాయకత్వంతో మనసులో నిండుగా ఎగసిపడుతున్న ఉత్సాహంతో తనని కలవటానికి ముందకు సాగుతున్నా........ 

Tuesday, August 27, 2013

urgent,call me


                        

   తనతో ఎలాగయినా మాట్లాడాలి బయలుదేరిన నాకు అప్పటికే ఆలస్యం అయిందని తెలీదు. ఎంతో ఆశతో బస్ స్టేషన్ కీ వచ్చిన నాకు ఆఖరి బస్సు వెళ్లి పోయింది అని తెలియటంతో ఆలస్యం అయిందని అర్థం అయింది. ఆలస్యం అమృతం విషం అని అనుకొంటూ రైలు స్టేషన్ కి బయలుదేరా. అక్కడ కూడా ఆలస్యం. విచారం తో విమానాశ్రయం వైపు పరుగులు తీసా. కానీ అదేమి అదృష్టమో ఆ రోజుకి ఆఖరి విమానం కూడా వెళ్లిపోయింది. నా ప్రయాణం ఒక రోజు వాయిదా పడిందని అర్థం అయిపోయింది.  కానీ ఆ ఒక రోజు ఆలస్యం నాకు వరమయింది. తన ఫోన్ లో ఉన్న missed call తో తను నాకు పరిచయం అయింది.
     ఉసూరుమంటూ ఇంటికి తిరిగివచ్చిన నాకు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఊరట వచ్చింది. నాకు కొత్త నెంబరు నుంచి కాల్ వచ్చింది. చిరాగ్గా ఫోన్ తీశా. అవతలి పక్క ఒక అందమైన స్వరం ఎవరు మీరు అనే ప్రశ్న వేసింది. ఆ స్వరం వినగానే చిరాకు ఎంటో పారిపోయింది. ఒక చక్కటి టీ తాగినపుడు వచ్చిన ఫ్రెష్నెస్ ఎన్నో బీర్లు కొట్టినపుడు ఎక్కే కిక్కు ఒక్క సారిగా నన్ను ఆవహించాయి. తమాయించుకుని ఎవరండీ మీరు అని అడిగా . 

తను : హాయ్ .  నాకు ఈ నెంబర్ నుంచి వారం రోజుల క్రితం " urgent , call me " అని మెసేజ్ వచ్చింది . 

నేను:  ఓకే . నేను ........... వారం క్రితం ..........sorry  అప్పుడు నేను ఫ్రెండ్ పెళ్లి అని రాజోలు లో ఉన్నా .  sure గా 
          ఇదే నెంబర్ నుంచి వచ్చిందా 
  
           ( extra  చేశా కదా )

తను : టెంకి పెళ్లి నే  కదా 
నేను : అవును 
తను : నువ్వు సాగర్ నా?
నేను: అవును . నేను మీకెలా తెలుసు 
    ( మనసులో ఎక్కడా లేని సంతోషం)
తను: నువ్వు ప్రదీప్ ఫ్రెండ్ కదా . అలా తెలుస్తూ ఉంటాయి లే. తనే ఆ రోజు message చేసుంటాడేమో లే 
       ( నేను గాల్లో తేలుతున్నా . తను నాతో మాట్లాడటానికి కారణం కోసం ఈ message సోది చెప్పిందని అర్ధం అయింది )
నేను: అయుంటది . anyway మీ పేరు ?
తను : నా పేరు శృతి . నేను చెన్నై లో work  చేస్తున్నా . 

       ఇలా మొదలయింది మా పరిచయం . ఆ రోజు గంట సేపు మాట్లాడుకున్నాము . తను నా మాటలు వింటూ అలా నవ్వుతూ తిరిగి సమాధానం ఇస్తుంటే జీవితం ఆనందమయం అయిపోయింది అనిపించింది. మేమిద్దరం ఆ తర్వాతి రోజు కలుద్దామనుకుని ఆ రోజుకి మా మాటలు ముగించాం . 
      
            వెంటనే గూగుల్ తీసి తన office అడ్రెసు వెతికా . నేను ఉండే ఇంటి నుంచి తను ఉండే ప్రదేశానికి దారి చూసాకనే నాకు అర్ధం అయింది చెన్నై ఎంత పెద్దదో అని. కానీ నేను తనని చేరుకోవటం లో ఏది అడ్డు రాదు అనుకొంటూ ఆ దారిని జాగ్రత్తగా గుర్తుంచుకున్నా .. మనసులో నా ఆనందానికి  అవధుల్లేవు .  ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు . చివరకి టైం వచ్చింది . బాగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని బాగా సెంటు కొట్టుకుని బైక్ మీద బయల్దేరా'. ఆ రోజు ఆ మహానగరం ఎంతో అందంగా కనిపిస్తుంది ......................... 

Saturday, August 24, 2013

ప్రయాణం

   
అలా తను నా ఎదురుగా వచ్చి ఆగింది. అప్పటి వరకు నా చుట్టూ స్థంబించిన ప్రపంచం ఒక్కసారిగా వేగం పుంజుకుని గిర్రున తిరిగింది. తల ఎత్తి అలా ప్రకాశించే తన మోము చూసాను. అప్పుడే అందరినీ నిద్రలేపిన సూర్యనివలే  ప్రకాశిస్తున్న ఆ ముఖారవిందం చూసి మైమరచిపోయాను. అలా నవ్వుతూ నా ఎదురుగా ఉన్న ఆ అందం చూస్తూ శిలనై నిలబడి పోయాను. ఎంత సమయం గడిచిందో తెలీదు. ఒక్క సారిగా నా చుట్టూ గిర్రున తిరుగుతున్న ప్రపంచం ఠక్కున ఆగింది. ఏదో వింత శబ్దం చేసింది. మనసులో ఉన్న ఆహ్లాదమంతా చిరాకులా మారింది. అప్పుడే అర్ధమయింది ఇదంతా కల అని.
అవునండీ. అది కలనే.  రోజు రాత్రి నన్ను పలకరించే అందమైన కల.  రోజు ఉదయాన్నే నాలో రాగాలు పలికించే ఆ అందమైన జ్ఞాపకం నా మదిలోకి చేరి వారం అయింది. ఒక స్నేహితుని పెళ్ళికి వెళ్ళి ఈ అందాన్ని చూసా . అప్పటినుంచే నా జీవితం మారింది . ఇదంతా ఒక పెళ్లి లో మొదలయింది కాబట్టే ఆ టైటిల్ పెట్టా . 
ఆ రోజు ఆదివారం . ఉదయాన్నే లేవాల్సిన పని లేదు. రోజు తను కలలో నా ముందుకు వచ్చి ఆగుతుంది కానీ మాట్లాడే లోపే అలారం మూగేస్తుంది . కానీ ఈ రోజు ఆదివారం కాబట్టి తను నాతో ఏం మాట్లాడుతుందో అనే ఆసక్తి తో అలారం పెట్టకుండా పడుకున్నా. ఎప్పటి లానే తను కలలోకి వచ్చింది. ఎదురుగా వచ్చి నుంచొని ఉంది .  నా అదృష్టం ఏంటో CD player లో ఆగిన CD లాగా ఆ scene అక్కడే ఆగిపోయింది . అలా తన ముఖం చూస్తూ మెలకువ వచ్చేసింది. 
అనుకున్నది జరగలేదని విచారంతో టీవీ పెట్టుకుని చూస్తున్నా. ఈ వారం రోజులు అన్నీ తన జ్ఞాపకంతో గడిచింది . ఇంతలో బొమ్మల పెట్టె లో విశ్వనాధ్ గారి డైయలాగు  వచ్చింది . ప్రేమని మనసులో ఉంచుకుని ఆలోచించు కోవటం కంటే ఆ ప్రేమని తెలియచేయటం ఉత్తమం . మన అహం కంటే ఎదుటివారు మనకి ముఖ్యం అని వారికి అర్ధం అయ్యేలా చేస్తే మనలని ఎవరు మాత్రం కాదంటారు. అది విన్నాక నేను ఆ రోజంతా ఆలోచించి తనని కలవాలని నిర్ణయించుకొని బయలుదేరా. 
ఇంతకు ముందు వరకు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలీదు అన్నాడు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాడు అనుకుంటున్నారా . పెళ్ళిలో నలుగురూ పిలిచినపుడు తన పేరు విన్నా
. నలుగురితో మాట్లాడుతున్నపుడు  తను ఏం చేస్తుందో తెలుసుకున్నా. సాయంత్రం బట్టలు సర్దుకుని ఇక banglore నగరానికి బయలుదేరా. కానీ నాకు తెలియదు అప్పటికే ఆలస్యం అయింది అని......   

Friday, August 23, 2013

పరిచయాలు


                                                 
     
  చినుకులా వచ్చిన వర్ష స్నేహం నా జీవితంలో ఎన్నో అనుభవాలకి ఆరంభం . తన వల్ల నాకు ప్రేమ పరిచయం అయింది . తను నన్ను కాదనుకుని వెళ్లిపోయినపుడు నాకు బాధ పరిచయం అయింది . ఆ బాధలో నా స్నేహితుడి అండ స్నేహాన్నినాకు పరిచయం చేసింది . వర్ష నన్ను వదలటానికి కారణం నా చుట్టూ వుంటూ స్నేహం పేరుతో జరిగిన వంచన అని తెలిసినపుడు నాకు ద్వేషం పరిచయం అయింది . ఆ ద్వేషమే నాకు కోపాన్ని పరిచయం చేసాయి . ఆ సమయంలో నా ఆలోచన దారి మళ్ళింది . ఇంత అవకాశం ఎదుటివాడికి ఇచ్చినందుకు నా మీద నాకు కోపం వచ్చింది . దాంతో నాకు కసి పరిచయం అయింది . నేనున్నా అంటూ కొత్త స్నేహం చేయి అందించింది .
ఆ నాటి కసి నా జీవితానికి మంచి మలుపునిచింది . నా జీవితం నా లోకం నుంచి మన లోకం ఆయింది. ఈరోజు నేను అని చెప్పుకునే నన్ను ఆ సంఘటనే మలిచింది . ఈ ప్రయాణంలో నాతో పాటు నడచిన నా స్నేహితుని జీవితం  , నా జీవితం నా దేవత వల్ల మళ్ళి మారాయి. అదేంటో ఇకపై వచ్చే నా ప్రేమకథలో చదవండి . 

తను

       


  తన పేరు : తెలీదు
  తన ఊరు : తెలీదు
  తను ఎవరు : తెలీదు
   నేను ఎవరు : మర్చిపోయాను

       తనని చూసిన క్షణం ఇదే నా పరిస్థితి . ఆ క్షణం వరకు తనేవ్వరో నాకు తెలీదు . తనని చూసాక నేను ఏంటో నాకు పట్టింపు రాలేదు . అందమైన ఆ కళ్ళని చూడగానే నా  కాళ్ళు నడకని ఆపేశాయి . చంద్రబింబం వంటి ఆ మోము చూసాక ఈ ప్రపంచమే నా దృష్టిలో విలువను కూల్పోయింది . అన్నిటికంటే విలువైనది నా కళ్ళ ముందుకి వచ్చిన భావన కలిగింది . ఆ క్షణం నా ప్రపంచమే స్తంభించింది. అలా దూరంగా నుంచొని తన చిరునవ్వుని చూస్తూ ఉండిపోయా . ఆ రాత్రి ఎపుడు కరిగిందో గుర్తులేదు . ఉదయం కళ్ళు తెరవగానే తన జ్ఞాపకమే కళ్ళ ముందు కదిలింది కాని తను కనిపించలేదు ....

ఏంట్రా వీడు ఇందాక కాలేజీ అన్నాడు ఇపుడేమో రాత్రి చూసా అంటునాడు అని అనుకుంటునారా . అవునండి . ఈ బ్లాగు వర్ష కోసం కాదు. నేను చూడగానే ప్రేమించిన నా దేవత కోసం

        తను ఎక్కడ ఉందా అని వెతుకుతున్న నా నయనాలని కాదని నా మనసు వినిపిస్తున్న గజ్జెల చప్పుడు వైపు నా చూపు తిప్పింది . పరికిణీలో ఆ బాపు బొమ్మ నా ముందు ప్రత్యక్షమయింది . పల్లెటూరి అమాయకత్వం తో కనుబొమ్మలు  ఆడిస్తూ  నా వైపే వచ్చింది . అలా వచ్చి నా ఎదురుగా ఆగింది ............. 

Thursday, August 22, 2013

నేను


నేను ఇది అని నా గురించి నేను చెప్పుకునేలా నాకంటూ నేనేమీ చేసుకోలేదు. చిన్నతనంలో అమ్మ చాటు కొడుకుని నేను. అమ్మ ఉందని ఇంట్లో అమ్మ పంపిందని బడిలో ఉండేవాడిని. చదువు ఉంటే చాలు జీవితంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా బ్రతికేయొచ్చు అనే భ్రమలో అమాయకత్వానికి అడ్రసులా భయానికి కజిన్ బ్రదర్ లా ఉండేవాడిని. ఫలితంగా ఐఐటీలో ప్రవేశం కూడా లభించింది. కానీ ఆ ఐదు సంవత్సరాల చెన్నై జీవితం నా భ్రమలన్నీ తొలగించింది. ప్రేమ, ద్వేషం, స్నేహం, శతృత్వం, బాధ, ఆనందం ఇలా మనసులో కలిగే ప్రతి భావనను నాకు పరిచయం చేసింది. ఒక అమ్మాయి పరిచయం నా జీవితాన్నే మార్చేసింది. ఆ రోజు స్వాతంత్ర్య దినోత్సవం. అప్పటికి నా జీవితంలో భ్రమలన్నీ తొలగి అమాయకత్వం , భయం మాత్రం మిగిలాయి. జెండా వందనం చేసి ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉన్న నా మోడువారిన జీవితంలోకి చినుకులాగా వచ్చింది నా వర్ష...........

Wednesday, August 21, 2013

ఆరంభం

                 
                   
                    అద్భుతమైన సువాసన ముక్కుకి తగిలినప్పుడు, నచ్చిన రుచి నాలుకకి అందినపుడు, శ్రావ్యమైన సంగీతం చెవులకి వినిపించినపుడు,నచ్చిన వారి స్పర్శ తగిలినపుడు మన మనసు ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తుంది. తనని మొదటిసారి చూసినపుడు అలాంటి పరిమళమే నా మనసుని తాకింది. ఈ కథకు ఆరంభం ఇక్కడే.
"LOVE AT FIRST SIGHT" అని ఎక్కడైనా వింటే నవ్వుకునే వాడిని. కానీ తనని చూసిన క్షణం నాలో కలిగిన భావనకు వేరే explanation లేదని అనిపిస్తుంది. మొదటి సారి తనని చూసిన క్షణం తన పేరు కూడా నాకు తెలీదు. కానీ ఎలా కనిపెట్టిందో నా మనసు మాత్రం జీవితాంతం తన పక్కనే ఉండమని చెప్పింది . అసలు తను ఎవరు , నేను  ఎవరు, మా ఇద్దరి పరిచయం ఎలాంటి మలుపులు తిరిగింది ఇలా మీ మనసులో మెదులుతూ ఉన్న చాలా ప్రశ్నలకు నా బ్లాగు సమాధానం . మీ అభిప్రాయాలని కామెంట్లతో నాకు తెలియచేయండి . ఈ రోజుకి శెలవు