Thursday, October 3, 2013

ఏం ముద్దో ఏం మాయో!!


                                       


         మూడు గంటల క్రితం. అది డిల్లీ ఎయిర్ పోర్టు. సాగర్ , సాకేత్ ఇద్దరూ కలిసి చెన్నై విమానం ఎక్కారు. ఆ విమానం చెన్నై చేరటానికి మూడు గంటలు పడుతుంది. విమానం గాల్లోకి లేవగానే అదే వేగంతో అలసటతో ఉన్న సాకేత్ నిద్రలోకి జారాడు. కానీ సాగర్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు. అతనికి చెన్నైకి ఎపుడెపుడు చేరతానా అని ఆత్రం. అదే సమయంలో మనసులో చిన్న సంకోచం. ఎన్నో మధురానుభూతులు నింపి , మరెన్నో చేదు ఙ్ఞాపకలని చూపి తన జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పిన ఈ చెన్నై మహానగరాన్ని సాగర్ వదలి ఐదు సంవత్సరాలు అవుతోంది. అందులో ఆఖరి రెండేళ్లు సాగర్ ఈ దేశంలోనే లేడు. మళ్ళా ఉద్యోగరిత్యా భారతదేశానికి వచ్చిన సాగర్ ఇక తన జీవితం చెన్నైలో గడపాలని నిర్ణయించుకున్నాడు. చరిత్ర పుటలలో లిఖించని సంఘటనలు, తన జీవితంలో మాత్రమే ప్రాముఖ్యత ఉన్న అనుభవాలు కళ్ళ ముందుకు వస్తుండగా మెల్లగా కనులు మూసి తన ఆలోచనల చిట్టాని తెరచాడు.
    అపుడు సమయం రాత్రి పన్నెండు కావస్తోంది. మంగళవారం. నేను నిద్రలోకి జారి ఇంచుమించు గంట అవుతోంది. అప్పుడు మోగింది నా ఫోన్. ఈ టైం లో ఎవరా అని చిరాగ్గా , కళ్ళు తెరవకుండా చేతులతో తడుముతూ  ఫోన్ ఎక్కడుందో వెతకి , మీట నొక్కి, చెవిన పెట్టి, నిద్ర మత్తులో "హలో " అన్నాను. " ఏరా, అపుడే పడుకున్నావా " అని అవతల నుంచి శృతి గొంతు వినిపించింది. ఇంకేముంది. వెంటనే చిరాకు , అంతకంతే వేగంగా నిద్ర, ఎగరిపోయాయి. "నిద్ర లో ఉన్నా రా. నువ్వు పడుకోలేదా? ఏం చేస్తున్నావు" అని అడిగా. " లేదురా ఇంకా. బాగా ఆకలేస్తుంది. ఇంట్లో ఈ పరీ పిల్ల మొత్తం తినేసింది. ఏమన్నా తెస్తావేమో అని చేసా" అని ఆశగా అడిగింది శృతి. " అరగంట లో అక్కడుంటా డార్లింగ్ " అని ఫోన్ పెట్టేశా. ఆ అర్ధరాత్రి చాలా రోడ్లు తిరిగి చివరకి వేడి వేడి ఇడ్లీలు సంపాదించా .
    తను నా కోసం ఇంటి బయట ఎదురు చూస్తోంది. ఇద్దరం వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న పార్కు లో బెంచీ మీద కూర్చున్నాం. "ఏం తెచ్చావ్ రా నా కోసం" అనడిగింది శృతి. ఆ చలికాలపు అర్ధరాత్రి లో ఇడ్లీ పొట్లం విప్పగానే ఎగసిన ఆవిరి, బయట చల్లదనానికి మంచులా మారి మా చుట్టూ కమ్మిందా అన్నట్టుంది. తను  ఇడ్లీలు అలానే చేతిలో పట్టుకొని నా కళ్ళలోకి  చూస్తోంది కానీ తినట్లేదు. "ఏరా ఆకలి చచ్చిపోయిందా "అని అడిగా. తను ఒక క్షణం ఆగి ఒక చిన్న నిట్టూర్పు విడచి "నీకేం అర్థం  కాదురా" అంది. నేను నవ్వుతూ  తన చేతిలోని ఇడ్లీలు తీసుకొని తనకి తినిపించాను.తను అలాగే నా కళ్ళలోకి చూస్తూ తింటోంది. నేను, తను, మా చుట్టూ మంచు అంతా ఏదో కొత్తగా , ఆహ్లాదంగా,సంతోషంగా అనిపించింది. అలా తినిపిస్తుంటే తన పెదాలను ముద్దాడుతున్న నా చేతి వేళ్ళు ఆహా ఏమి అదృష్టం చేసుకున్నాయి అని నా ఆలోచనలు గతి తప్పుతున్నాయి. అలా ప్రేమతో తినిపిస్తూ తన కళ్ళలోకి చూస్తూ నన్ను నేను మర్చిపోయాను. నా ప్రాణం నన్ను వదలి తనలో కలసిపోయిందనిపించింది.ఇంతలో స్టోరీ లో ట్విస్ట్. తెచ్చిన ఇడ్లీలు అయిపోయాయి. అలానే కళ్ళలోకి చూస్తూ "ఆకలి తీరిందా "అని అడిగా. తను తల దించుకొని కొంచెం సిగ్గు కొంచెం సంకోచంతో ఊ కొట్టింది. ఇంకొక క్షణం నిశ్శబ్దం తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని ఈ ప్రపంచం లోకి వచ్చాం. 
    "ఇక వెళ్దాం పద. రేపు ఆఫీసు ఉంది కదా" అని లేచి తన ఇంటి వైపు అడుగులు వేశాం. తను నన్ను ఆపి ఇలా వద్దు. పార్కు మధ్యలోంచి వెళ్దాం. కొంచెం దగ్గర అని అంది."వద్దు బంగారం. అటు లైట్లుండవ్. పైగా కుక్కలుంటాయి. వద్దు "అంటూ ముందుకు ఒక అడుగు వేశా. శృతి అలిగినట్టు ముఖం పెట్టి "నేను రాను. నేను ఇలానే వెళ్తాను "అంటూ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టింది. సరే వెళ్లు అంటూ నేను కొంచెం దూరం ముందుకు వెళ్లాక నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఎవరా అని చూస్తే శృతి. " ముద్దిస్తానన్నా రావా :)  " అని ఆ మెసేజ్ సారాంశం. ఇంకేముంది. ఒక్కసారిగా మనసు గట్టిగా వెనుకకి లాగింది. నీ శృతి నీకు ప్రేమతో ముద్దిస్తానంటే ఇకేం ఆలోచిస్తన్నావు రా అని బుద్ధి మందలించింది. బుద్ధి మనసు ఒకేసారి ఒకటే చెప్పటంతో తన వద్దకు పరిగెత్తా. "ఏరా, ముద్దనగానే వచ్చేశావు" అని ఏడిపించింది శృతి. అపుడు నేను తన భుజాల మీద చేయి వేసి తనని నా వైపు తిప్పి చాలా దగ్గరగా వెళ్లి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి " నీ ముద్దు మీద వ్యామోహంతో కాదు శృతి. ఆ ముద్దులో ఉండే నీ ప్రేమ కోసం వచ్చా " అన్నాను. తను సిగ్గు పడుతూ " నీలో కవి కూడా ఉన్నాడా " అంది. ఒక చిన్న నవ్వు నవ్వి ఇద్దరం మళ్ళా నడవటం మొదలుపెట్టాం. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు నడుస్తున్నాం. ఎంతసేపు నడుస్తావురా , తనకి ముద్దు పెట్టు అని మనసు గోల పెడుతున్నా ధైర్యం సరిపోవటం లేదు. నోరు పెగలి మాట బయటికి రానంది. తన ఇంటికి దగ్గరగా వచ్చి ఆగాం. తను అలా తిరిగి ఇంటి వైపు అడుగేస్తుంటే మనసు బరువెక్కింది. తను ఇంకొక అడుగు తను వేయబోతుండగా తన చేయి పట్టుకొని తనని నా వైపు లాగాను.తను దగ్గరగా వచ్చి గుద్దుకొని నన్ను గట్టిగా పట్టుకొంది. తన చుట్టూ చేతులు వేసి మా పెదవులని ఒక్కటి చేసి ముద్దిచ్చాను.  ఆ పెదవుల మృదుత్వం, తన ప్రేమతో నిండిన ఆ ముద్దులోని పాశం కలగలిపిన ఆ మధువుని జీవితంలో మొదటిసారి ఆస్వాదించిన క్షణం, ఒక మధురానుభూతి. 


    ఇంతలో ఎవరోజు తట్టినట్టు అనిపించడంతో ఆ ఆలోచన నుంచి బయటకి వచ్చాడు సాగర్. ఇంకొక ఐదు నిమిషాలలో చెన్నై లో దిగుతాం అని పైలట్ చెప్పటంతో కిటికీ లోంచి కిందకి చూడగా తను ఎప్పుడో దూరమైన బీచ్ కనిపించింది. ఆ బీచ్, దాని పక్కనే చర్చ్ , దగ్గరలో స్కూల్, ఆ స్కూల్ మైదానంలో ఆడుతున్న పిల్లలు. పైనుంచి చిన్నవిగా కనిపిస్తున్నా, వాటినే గమనిస్తూ ఉన్నాడు సాగర్. అదే విమానాన్ని కింద నుంచి చూస్తూ కేరింతలు కొడుతున్న చిన్నారులని గమనిస్తున్న శృతి, పైకి చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వు సాగర్ ని తాకింది. అతని మనసుని ఆహ్లాదంగా చేసింది. ఐదేళ్ల క్రితం అర్ధాంతరంగా వదలి వెళ్లిన ఆ చెన్నై మహానగరంలో జీవితం కొనసాగించటానికి తన మూడేళ్ల కొడుకు సాకేత్ తో కలిసి విమానం దిగాడు సాగర్......

2 comments:

  1. రేయ్.. రేయ్..! ఈ కథలేంటీ.. వాటిలో ఆ ఫీల్ ఏంటీ.. నిజంగా నువ్వే రాస్తున్నావా?! నువ్వే అయితే, ఎక్కడా తగ్గొద్దురా.. బాగా రాస్తున్నావ్ all the best :) :)

    ReplyDelete
  2. last lo anta pedda twist endi bhayya...

    ReplyDelete